Asaduddin Owaisi : దేశంలో కొన్ని రాష్ట్రాలలో వివిధ పండుగల సందర్భంగా మాంసం అమ్మకాల్ని ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయి. ఇదే అంశంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇతర మతాల పండుగల సందర్భంగా మాంసం అమ్మకాల్ని నిషేధించినట్లే రంజాన్ మాసంలో మద్యం అమ్మకాల్ని నిషేధిస్తారా అంటూ ప్రశ్నించారు. కొన్ని మతాల పండుగల సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నారని, ఈ విషయంలో కొందరిపై వివక్ష చూపుతున్నారని ఒవైసీ ఆరోపించారు.
హైదరాబాద్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఈద్ మిలాప్ ఈవెంట్లో ఒవైసీ మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. రోడ్లపై నమాజ్ చేయడం తప్పే అయితే, రోడ్లపై జరిగే ప్రతి పండుగను, వేడుకను అలాగే నిషేధించాలని సూచించారు. కొన్ని పండుగలప్పుడు మాంసాన్ని నిషేధించినట్లే, రంజాన్ మాసంలో మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధిస్తారా అంటూ ప్రశ్నించారు. రంజాన్ మాసంలో 30 రోజులపాటు మద్యం అమ్మకాల్ని నిషేధించాలన్నారు. మరోవైపు అసోంలో యూసీసీ చట్టాన్ని చేస్తూ ఇటీవల అక్కడి అసెంబ్లీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. యూసీసీ బిల్లును అసోం ప్రభుత్వం ఆమోదించింది. అయితే, దీనిపై అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
जब दूसरे त्योहारों पर गोश्त की दुकानें बंद करा रहे हो, तो रमज़ान में शराब की दुकानें भी बंद होनी चाहिए : Barrister @asadowaisi pic.twitter.com/01DsVwEzcq
— AIMIM (@aimim_national) May 30, 2026
హిందూ వివాహ సంప్రదాయాల్ని ముస్లింలపై రుద్దుతున్నారు అంటూ మండిపడ్డారు. యూసీసీ చట్టం నుంచి గిరిజన తెగల్ని ఎందుకు మినహాయింపు ఇచ్చారని, మిగతా వారికి ఎందుకు వర్తింపజేస్తున్నారని ప్రశ్నించారు. అసోం జనాభాలో 12 శాతం ఉన్న గిరిజనుల్ని ఈ చట్టం నుంచి మినహాయించడం ఏంటని విమర్శించారు. హిందువులకు సంబంధించి పెళ్లి విషయంలో, బంధుత్వాల విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయన్నారు. బంధుత్వాల్లో వరుసలకు సంబంధించి ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే విషయంలో హిందువులకు రూల్స్ ఉన్నాయని, కానీ, ముస్లింలకు లేవన్నారు. ఈ విషయంలో ముస్లింలను ఆపడానికి మీరెవరు అని ప్రశ్నించారు. ఇతర మతాల చట్టాల్ని ముస్లింలపై ఎందుకు రుద్దుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.