Congress | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జీని ఆ పార్టీ అధిష్టానం మరోమారు మార్చేసింది. ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న దీపాదాస్ మున్షీని తప్పించి.. ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాలు జారీ చేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మీనాక్షి నటరాజన్‌తోపాటు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్చార్జీలను నియమించింది. హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ కొత్త ఇన్‌చార్జీగా రజనీ పాటిల్, హర్యానాకు బీకే హరిప్రసాద్, మధ్య ప్రదేశ్‌కు హరీశ్ చౌదరి, తమిళనాడు-పుదుచ్చేరిలకు గిరీష్ చౌడాంకర్, ఒడిశాకు అజయ్ కుమార్ లల్లూ, జార్ఖండ్‌కు కే రాజు, మణిపూర్- త్రిపుర – సిక్కిం- నాగాలాండ్ రాష్ట్రాలకు సప్తగిరి శంకర్ ఉల్కా, బీహార్‌కు కృష్ణ అల్లవారులను నియమిస్తున్నట్లు తెలిపింది.