AIADMK | చెన్నై : తమిళనాడులో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగిందని భావిస్తే.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ను లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని బీజేపీకి అన్నాడీఎంకే సీనియర్ లీడర్ కేపీ మునిసామి సవాల్ విసిరారు. నిర్మలా సీతారామన్, జైశంకర్ ఇద్దరు కూడా తమిళనాడు వాసులే.
ఈ సందర్భంగా మునిసామి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలైని ఈ వేదిక నుంచి ఒక్కటే అడుగుతున్నాను. తమిళనాడులో మీ పార్టీకి మద్దతు పెరిగిందని మీరు భావిస్తే.. ఇక్కడ్నుంచి వారిద్దరిని పోటీ చేయించాలన్నారు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే.. తమిళ ప్రజలు తమను ఆదరిస్తారన్న నమ్మకం ఉంటే.. రాష్ట్రంలోని ఏ లోక్సభ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయించి, గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తమిళ ప్రజలు తగినబుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాజ్యసభ ఎంపీలుగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్, జైశంకర్.. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని బీజేపీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు రాష్ట్రం నుంచే వారిద్దరూ పోటీ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మునిసామి తీవ్రంగా స్పందించారు.