AIADMK : తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే (AIADMK) తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు (వేలుమణి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు) పళనిస్వామి (Palaniswamy) తో భేటీ అయ్యారు. సోమవారం ఆయన నివాసంలో పళనిస్వామిని కలిశారు. అయితే మాజీ మంత్రి షణ్ముగం (Shanmugam) మాత్రం ఈ సమావేశానికి రాలేదు. పళనిస్వామితో భేటీ అనంతరం వేలుమణి మాట్లాడుతూ.. అన్నాడీఎంకేలో చీలిక లేదని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పళనిస్వామికి పూర్తిగా మద్దతిస్తున్నట్లు వెల్లడించారు.
తామందరం ఐక్యంగా ఉన్నామని, ముందుగా షణ్ముగంను కలిసిన తర్వాతనే తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. అనంతరం వేలుమణి బృందం స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసింది. అసెంబ్లీలో అంతా ఒకే పార్టీగా పనిచేస్తామని ఆయనకు లేఖ సమర్పించింది. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో మాజీ మంత్రులు వేలుమణి, సీవీ షణ్ముగం నాయకత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే అధిష్ఠానంపై తిరుగుబాటు చేశారు. టీవీకే (TVK) ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు.
అయితే వారిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద పదవుల నుంచి తొలగించాలని పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలు సభాపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ అన్నాడీఎంకే గూటికి చేరడం గమనార్హం.