న్యూఢిల్లీ : వ్యవసాయ ఉత్పత్తుల పెంపు, రైతులకు అవసరమైన సలహాలను ఇవ్వడం కోసం బహు భాషా కృత్రిమ మేధ (ఏఐ) టూల్ ‘భారత్-విస్తార్’ను కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. దీని కోసం రూ.150 కోట్లు కేటాయించారు. ఈ టూల్ అగ్రిస్టాక్ పోర్టల్స్‌ను, వ్యవసాయ పద్ధతులపై ఐసీఏఆర్ ప్యాకేజ్ని సమీకృతం చేస్తుంది. ఇదిలావుండగా, ఈ బడ్జెట్లో కాటన్ టెక్నాలజీ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ హైబ్రిడ్ సీడ్స్‌లకు నిధులను కేటాయించలేదు.
ఈ రెండింటిని గత బడ్జెట్లో ప్రకటించారు. కానీ ఇంకా అమల్లోకి రాలేదు. కూరగాయలు, పండ్లు కోసం ఏర్పాటు చేసిన మిషన్‌ను కృష్ణియోన్నతి యోజనతో కలిపేశారు. దీనికి రూ.700 కోట్లు కేటాయించారు. మఖానా బోర్డు పేరును మార్చి, రూ.90 కోట్లు కేటాయించారు. పీఎం-కిసాన్‌కు రూ.63,500 కోట్లు కేటాయించారు. వ్యవసాయ పరిశోధన, విద్య కోసం కేటాయింపులను 3 శాతం తగ్గించి, రూ.9,964.40 కోట్లు ఇచ్చారు.