న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 : విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన యువ పైలట్(30) గుండెపోటుతో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని నడిపిన సదరు పైలట్, ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే మరణించటం కలకలం రేపింది. విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో దింపే సమయానికి పైలట్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వెంటనే అతడ్ని దవాఖానకు తీసుకుపోయినప్పటికీ.. ఆయన ప్రాణాలు నిలువలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ఎంతో విలువైన సహ ఉద్యోగిని కోల్పోయినందుకు మేం ఎంతగానో చింతిస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు సాధ్యమైనంత సాయం అందిస్తాం’ అని ఎయిర్లైన్స్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.