న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే కాషాయ పార్టీకి చేరడంతో విపక్షం డీలా పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైనీ, ఎస్పీ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్, మాజీ ఎస్పీ ఎమ్మెల్యే ధర్మపాల్ సింగ్‌లు ఆయా పార్టీలను వీడి ఢిల్లీలో యూపీ బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో బుధవారం కమలం గూటికి చేరారు.
బీజేపీ ఓబీసీ నేత, మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్పీలో చేరేందుకు సిద్ధమైన నేపధ్యంలో కాషాయ పార్టీలో తాజా చేరికలు బీజేపీలో ఉత్తేజం నింపాయి. కాగా స్వామి ప్రసాద్ మౌర్య యోగి క్యాబినెట్ నుంచి వైదొలుగుతూ దళితులు, బీసీలు, రైతులు, యువత, వ్యాపారుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడంతోనే తాను ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి బయటకు వచ్చానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
మౌర్యతో పాటు మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో అసెంబ్లీ ఎన్నికల వేళ కమలంలో కల్లోలం రేగింది.ఇక ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.