న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే దీనికి ముందు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు 8 మంది ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. శుక్రవారం పార్టీకి రాజీనామా చేసిన ఆ ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. (APP MLAs join BJP) వందన గౌర్ (పాలం), రోహిత్ మెహ్రౌలియా (త్రిలోక్‌పురి), గిరీష్ సోని (మాదిపూర్), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), రాజేష్ రిషి (ఉత్తం నగర్), బీఎస్ జూన్ (బిజ్వాసన్), నరేష్ యాదవ్ (మెహ్రౌలి), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్) కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
కాగా, ఆప్‌కు రాజీనామా చేసిన ఈ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే ముందు తమ ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు. అయితే ఈ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లను ఆప్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఆప్‌ను వీడి బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారు.