ఫతేహబాద్: యూపీలోని ఫతేహబాద్లో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై సోమవారం రెండు గంటలపాటు వేలాది వాహనాలు టోల్ చార్జీ చెల్లించకుండా ఉచితంగా వెళ్లిపోయాయి. దీపావళి బోనస్ పట్ల అసంతృప్తిగా ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది గేట్లన్నీ తెరచి పెట్టడమే ఇందుకు కారణం.
తమకు రూ.1,100 మాత్రమే పండగ బోనస్ ఇచ్చారని ఫతేహబాద్ టోల్ ప్లాజాలో పనిచేసే శ్రీ సైన్ & డటర్ కంపెనీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు వచ్చి కంపెనీ, సిబ్బంది మధ్య చర్చలు జరిగేలా చూశారు. జీతం 10 శాతం పెంచుతామని అధికారులు చర్చల అనంతరం ప్రకటించారు. అయితే ఈ ఏడాది మార్చిలోనే టోల్ కాంట్రాక్ట్ కంపెనీకి వచ్చినందున ఉద్యోగులకు ఒక సంవత్సరం పూర్తి బోనస్ చెల్లించలేమని స్పష్టం చేశారు. అధికారుల హామీతో ఉద్యోగులు ధర్నా విరమించారు.