న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మే 9న జమ్ము కశ్మీరులోని పూంచ్‌లో సరిహద్దుల అవతల నుంచి జరిగిన కాల్పులలో అమరుడైన అగ్నివీర్ ఎం మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి శ్రీరామ్ నాయక్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాధారణ సైనికులు వీరమరణం చెందినపుడు వారి కుటుంబాలకు కల్పించే ప్రయోజనాలు, కుటుంబ రక్షణల విషయంలో తమ పట్ల వివక్ష చూపడాన్ని ఆమె తన పిటిషన్లో సవాలు చేశారు.
ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లి తండా అనే చిన్న గిరిజన గ్రామానికి చెందిన నాయక్ ముంబైలో నివసిస్తున్నారు. విధి నిర్వహణలో తన కుమారుడు అమరుడైనట్లు మే 10న తనకు లేఖ వచ్చిందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. రెగ్యులర్ సైనికులు, అగ్నివీరులు ఒకేరకమైన విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో ఒకే స్థాయిలో ఆత్మబలిదానం చేసినప్పటికీ ఉద్యోగ ప్రయోజనాలలో మాత్రం అసమానతలు చూపుతున్నట్లు తెలిపారు.