లక్నో: పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్.. మహ్మద్ ప్రవక్తపై వివాదస్ప వ్యాఖ్యలు చేయడంపై ఉత్తర ప్రదేశ్‌లో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం ముస్లింల ప్రార్థనల తర్వాత హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు యూపీ అధికార యంత్రాంగం ప్రతీకార చర్యలు చేపట్టింది. అల్లర్లలో అరెస్టైన నిందితుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నది. సహరాన్పూర్ జిల్లాలో శుక్రవారం అల్లర్లకు పాల్పడిన 64 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు నిందితులైన ముజమ్మిల్, అబ్దుల్ వకీర్ ఆస్తులపై శనివారం బుల్డోజర్లకు పని చెప్పారు. అక్రమ నిర్మాణాల పేరుతో గేట్‌ను, బయట గోడలను కూల్చివేశారు. స్థానిక ముస్సిపల్ సిబ్బంది భారీ పోలీస్ భద్రతతో ఆయా ప్రాంతాలకు వెళ్లి ఈ కూల్చివేతలు చేపట్టారు.
అలాగే ఈ నెల 3న (గత శుక్రవారం) కాన్పూర్‌లో రాళ్ల దాడులు, అల్లర్లు జరిగాయి. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హింసలో ప్రధాన నిందితుడైన స్థానిక నాయకుడు జాఫర్ హయత్ హష్మీకి ల్యాండ్ మాఫియాతో సంబంధం ఉందని కాన్పూర్ అధికారులు, పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన సమీప బంధువైన మహ్మద్ ఇష్తియాక్ కొత్తగా నిర్మించిన భవనాన్ని కాన్పూర్ డెవలప్మెంట్ అథారిటీ (కేడీఏ) శనివారం కూల్చివేసింది. ఈ కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అధికారులు విడుదల చేశారు.