ముంబై: మహారాష్ట్రలో ప్రతిపక్షమైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) (Samajwadi Party) షాక్ ఇచ్చింది. ఆ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీ శనివారం ఈ విషయాన్ని ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) ఓడిన తర్వాత ‘హిందుత్వ ఎజెండా’ను అవలంబించిందని ఆయన ఆరోపించారు.
కాగా, సీట్ షేరింగ్ సమయంలో, ఆ తర్వాత ప్రచారంలో కూడా ఎంవీఏలో సమన్వయం లేదని మహారాష్ట్ర ఎస్పీ అధ్యక్షుడైన అబూ అజ్మీ విమర్శించారు. ‘అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అంతర్గత సమావేశంలో హిందుత్వ ఎజెండాను దూకుడుగా కొనసాగించాలని తన నాయకులు, పార్టీ కార్యకర్తలకు చెప్పారు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతకు అనుకూలంగా ఆ పార్టీ సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేసింది. దీన్ని మేం సహించబోం. కాబట్టి ఎంవీఏతో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాం’ అని అన్నారు.
మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్వాదీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎంవీఏ బహిష్కరించింది. అయితే ఎస్పీ ఎమ్మెల్యేలు అబూ అసిమ్ అజ్మీ, రైస్ షేక్ ఈ పిలుపును ధిక్కరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.