భోపాల్: ఒక యువతి స్విమ్మింగ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో తీసిన స్నేహితురాలితో ఆమె ఘర్షణకు దిగింది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు యువతులు కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్నారు. (Teen Girls Stab Each Other) మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 18 ఏళ్ల యువతి ఒక చెరువులో ఈత కొట్టింది. 19 ఏళ్ల స్నేహితురాలు దీనిని వీడియో రికార్డ్ చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ విషయం ఆ యువతికి తెలిసింది. వీడియో తీసిన స్నేహితురాలితో ఘర్షణకు దిగింది. దీంతో వీరిద్దరూ కొట్టుకున్నారు. చివరకు కత్తులతో ఒకరిని మరొకరు పొడుచుకుని గాయపడ్డారు. అనంతరం మధోటల్ పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
మరోవైపు కఠోండ చెరువు సమీపంలో ఇద్దరు యువతులు కత్తులతో పొడుచుకున్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరు యువతులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇద్దరి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.