Amrit Kaal | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ వల్లెవేసిన ‘అమృత్ కాల్’ భ్రమలు క్రమంగా వీడిపోతున్నాయి. దేశప్రగతికి సూచికలుగా నిలిచే ద్రవ్యోల్బణం, రూపాయి విలువ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, ఫారెక్స్ నిల్వలు ఇలా పది అంశాల్లో భారత్ అంతకంతకూ దిగజారిపోతున్నది. ఇదీ తొమ్మిదిన్నరేండ్ల మోదీసర్కారు పాలనతీరు.
ద్రవ్యోల్బణం
ఆహారోత్పత్తుల ధరలు భగ్గుమంటున్నాయి. సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.02 శాతానికి చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది వ్యవధిలో కూరగాయల ధరలు 62.12 శాతం పెరిగాయి. వాణిజ్య సిలిండర్ ధర రూ. 2 వేలకు చేరింది.
రూపాయి విలువ పతనం
బీజేపీ సర్కారు అసమర్థ విధానాలతో దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమవుతున్నది. దాని ప్రభావం రూపాయిపై పడుతున్నది. దీన్ని ధ్రువపరుస్తూ.. బుధవారం ఫారెక్స్ మార్కెట్లో ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠం 83.35కు పతనమైంది.
నిరుద్యోగం
ఏడాదికి రెండుకోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని మోదీ సర్కారు ఆ హామీని అటకెక్కించింది. అక్టోబర్‌లో నిరుద్యోగిత రేటు 10.05 శాతానికి ఎగబాకింది. రెండున్నరేండ్ల వ్యవధిలో ఇది అత్యధికమని సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడించింది.
పరిశ్రమల మూత
ప్రధాని మోదీ పాలనలో రోజుకు 300 చొప్పున ఏకంగా 10 లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతబడ్డట్టు నివేదికలు చెబుతున్నాయి. పారిశ్రామికాభివృద్ధి కుంటుపడుతున్నది. శ్రామికశక్తి నిర్వీర్యమవుతున్నది.
తయారీరంగం
పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న డిమాండ్ వెరసి అక్టోబర్‌లో భారత తయారీ రంగం కార్యకలాపాలు గడిచిన 8 నెలల్లో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ఈ మేరకు బుధవారం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) నివేదిక వెల్లడించింది.
ఎగుమతుల క్షీణత
దేశ ఆర్థిక పరిపుష్ఠతకు కీలకమైన ఎగుమతుల్లో క్షీణత అంతకంతకూ పెరుగుతున్నది. సెప్టెంబర్ నెలలో దేశీయ ఎగుమతులు 2.6 శాతం తగ్గి 34.47 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడాది వ్యవధిలో ఎగుమతుల్లో క్షీణత 23 శాతంగా నమోదైంది.
వాణిజ్యలోటు
దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం ఎంతకూ దిగిరావడంలేదు. కేంద్రం అసమర్థ విధానాలే దీనికి కారణం. ఒకవైపు దిగుమతులు ఆకాశాన్నంటుతుంటే, ఎగుమతులు క్షీణిస్తున్నాయి. ఫలితంగా వాణిజ్యలోటు 19.37 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఫారెక్స్ నిల్వలు
విదేశీ మారక నిల్వలు ఆవిరైపోతున్నాయి. ఫారెక్స్ రిజర్వుల పతనానికి అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్‌బ్యాంక్ చేసిన ప్రయత్నాలూ బెడిసికొడుతున్నాయి. విదేశీ మారకం నిల్వలు 2.36 బిలియన్ డాలర్లు కరిగిపోయి 583.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
విక్రయాలు
పెరిగిన ధరలు, ఉద్యోగుల్లో కోత వెరసి ప్యాసింజర్ వాహన విక్రయాలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. ఏడాది వ్యవధిలో విక్రయాలు 22.2 శాతం మేర మందగించినట్టు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. సాగుకు అవసరమైన ట్రాక్టర్ విక్రయాలు తగ్గుతున్నట్టు పేర్కొన్నాయి.