తిరువనంతపురం : కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ( SDPI ) నాయకుడు కేఎస్ షాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆ హత్య ఘటన మరువకముందే ఆదివారం ఉదయం బీజేపీ నాయకుడు రేంజిత్ శ్రీనివాసన్ కూడా మర్డర్‌కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో అలప్పుజా జిల్లాలో రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు.
శనివారం రోజు కేఎస్ షాన్ తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కొచ్చి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే షాన్‌ను హత్య చేశారని ఎస్డీపీఐ ప్రెసిడెంట్ ఎంకే ఫైజీ ఆరోపించారు. ఈ వరుస హత్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. హత్య ఘటనలను తీవ్రంగా ఖండించారు. ఈ హత్యల వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని సీఎం పోలీసులను ఆదేశించారు.