చెన్నై: స్పైస్‌జెట్ (SpiceJet plane) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానాన్ని పరిశీలించగా వీల్ టైర్ పాడైనట్లు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున జైపూర్ నుంచి చెన్నైకు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్లు గుర్తించారు. దీంతో చెన్నై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు.
కాగా, ఆదివారం తెల్లవారుజామున 5:46 గంటలకు చెన్నై విమానాశ్రయంలో ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం ఆ విమానాన్ని సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా విమానం టైర్ పగిలి పాడైనట్లు గుర్తించారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు స్పైస్‌జెట్ సంస్థ పేర్కొంది.
మరోవైపు ఐఏటీఏ ఆపరేషనల్ సేఫ్టీ ఆడిట్ సర్టిఫికేషన్‌ను స్పైస్‌జెట్ ఇటీవల విజయవంతంగా పునరుద్ధరించింది. 2027 మార్చి వరకు ఇది చెల్లుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇది వెల్లడించిన రెండు రోజుల తర్వాత తాజాగా ఈ సంఘటన జరిగింది.