గౌహతి: బీటెక్ విద్యార్థి మృతిపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో డీన్‌ను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐఐటీ గౌహతి (IIT-Guwahati) డీన్ రాజీనామా చేశారు. అస్సాం రాజధానిలోని ఐఐటీ గౌహతిలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల బీటెక్ విద్యార్థి సోమవారం హాస్టల్ రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఏడాదిలో మూడో స్టూడెంట్ మరణించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
కాగా, పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినా హాజరు తక్కువగా ఉండడంతో సుమారు 200 మందిని ఫెయిల్ చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. స్టూడెంట్స్పై ఒత్తిడి పేరుతో విద్యా సంస్థలో విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దీనికి కారణమైన డీన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు విద్యార్థుల భారీ నిరసన నేపథ్యంలో అకడమిక్ డీన్ ప్రొఫెసర్ కందూరు వీ కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన ఆయన రాజీనామాను ఐఐటీ గౌహతి యాజమాన్యం ఆమోదించింది.