ముంబై: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), జామియా మిలియా ఇస్లామియా బాటను ఐఐటీ బాంబే (IIT Bombay) అనుసరించింది. టర్కీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేసింది. శనివారం ఈ మేరకు ప్రకటించింది. ‘టర్కీకి సంబంధించిన ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా, తదుపరి నోటీసు వచ్చే వరకు టర్కిష్ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలను ఐఐటీ బాంబే నిలిపివేస్తోంది’ అని ఎక్స్‌లో పేర్కొంది. పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నది.
కాగా, జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యలను టర్కీ వ్యతిరేకించింది. పైగా పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. అంతేగాక టర్కీ అందజేసిన డ్రోన్లను భారత్‌పైకి పాకిస్థాన్ ప్రయోగించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన టర్కీపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. బాయ్‌కాట్ టర్కీ పేరుతో ఆ దేశ వస్తువులను వ్యాపారులు బహిష్కరించారు. అలాగే ట్రావెల్ ఏజెన్సీలు కూడా టర్కీతోపాటు అజర్‌బైజాన్‌కు టూర్ ప్యాకేజీలు నిలిపివేశాయి.
Due to the current geopolitical situation involving Turkey, IIT Bombay is processing suspension of its agreements with Turkish universities until further notice.
— IIT Bombay (@iitbombay) May 17, 2025