న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదిక 2023 జనవరిలో బయటకు వచ్చిన తర్వాత అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ సహచరులు ఇద్దరిపై ఇటలీలోని అతి పెద్ద బ్యాంకు దర్యాప్తు జరిపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఈనెల 17న వార్తా కథనాన్ని ప్రచురించింది. షేర్ల ధరల మోసం, ఇన్సైడర్ ట్రేడింగ్సహా వివిధ అక్రమాలకు పాల్పడినట్లు అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించిన వెంటనే వినోద్ అదానీతో సంబంధాలు ఉన్న తన క్లయింట్ల లావాదేవీలపై బ్యాంకు దర్యాప్తు జరిపినట్లు పత్రిక పేర్కొంది.
తైవాన్ వ్యాపారవేత్త చోంగ్ చుంగ్ లింగ్, యూఏఈకి చెందిన నాసర్ అలీ షమన్ అహ్లీల కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉండడంతో వారిద్దరి బ్యాంకు ఖాతాలపై 2023లో ఇటలీ బ్యాంకు శాన్పోలో ఆంక్షలు విధించింది. దర్యాప్తు అనంతరం వారిద్దరూ హిండెన్‌బర్గ్ నివేదికలోని ఆరోపణలను తోసిపుచ్చుతూ వాంగ్మూలంపై సంతకం చేసినట్లు పత్రిక తెలిపింది.