Omar Abdullah | శ్రీనగర్ : జమ్మూలోని పలు ప్రాంతాలపై గురువారం పాక్ డ్రోన్దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి జమ్మూకశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు. జమ్మూ నగరంతో పాటు డివిజన్లోని ఇతర ప్రాంతాలపై పాక్ విఫల దాడుల తర్వాత పరిస్థితులను అంచనా వేసేందుకు జమ్మూ కశ్మీర్‌కు వెళ్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జమ్మూ, సాంబా, ఆర్ఎస్ పురాతో పాటు పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు, స్మాల్ రేంజ్ మిస్సైల్స్ దాడికి ప్రయత్నించగా.. సైన్యం తిప్పికొట్టింది. పాకిస్తాన్ దళాల సహాయంతో ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో చొరబాటు ప్రయత్నించారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు చేసిన చొరబాటు ప్రయత్నాలను భగ్నం చేసినట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు.
బీఎస్ఎఫ్ వేగంగా స్పందించడంతో ఉగ్రవాదులు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ప్రతినిధి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లోని పౌర నివాస ప్రాంతాలపై పాకిస్తాన్ భారీ మోర్టార్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరరొకరు గాయపడ్డారు. బారాముల్లాకు వెళ్తున్న వాహనంపై మోహురా సమీపంలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో నర్గీస్ బేగం అనే మహిళ మృతి చెందగా, హఫీజా బేగం అనే మరో మహిళ గాయపడిందని పేర్కొన్నారు. పాకిస్తాన్ సైన్యం ఉరి, తంగ్ధర్, పూంచ్, నియంత్రణ రేఖలోని రాజౌరి, అంతర్జాతీయ సరిహద్దులోని సాంబాలో భారీ మోర్టార్ దాడులు కొనసాగించిందని వివరించారు. జమ్మూ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్లు, స్మార్ రేంజ్ మిస్సైల్స్‌ని పాక్ సైన్యం ప్రయోగించిందని.. వాటిని రక్షణ వ్యవస్థలు గాలిలోనే పేల్చివేశాయని అధికారులు పేర్కొన్నారు.