బెంగళూరు: వీడియో కాల్లో మాట్లాడుతున్న భార్యను చూపించలేదన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి సహోద్యోగిని కత్తెరతో పొడిచాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 56 ఏళ్ల సురేష్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. 49 ఏళ్ల రాజేష్ మిశ్రా కోరమంగళ సమీపంలోని వెంకటాపురలో నివసిస్తున్నాడు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ సెక్టార్ 2లోని ఒక దుస్తుల షాపులో టైలర్ కమ్ సేల్స్‌మెన్‌గా వారిద్దరూ పనిచేస్తున్నారు.
కాగా, సోమవారం రాజేష్ మిశ్రా వీడియో కాల్లో తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఇంతలో సురేష్ అక్కడకు వచ్చాడు. రాజేష్ మిశ్రా భార్యను వీడియో కాల్లో చూపించాలని అడిగాడు. దీనిపై వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సురేష్ అక్కడ ఉన్న కత్తెరతో రాజేష్‌ను పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఆ షాపులోని మిగతా సిబ్బంది వెంటనే స్పందించారు. గాయపడిన రాజేష్ మిశ్రాను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు సురేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.