Odisha | భువనేశ్వర్ : దొంగల్లోనూ నిజాయితీ దొంగలు ఉంటారు. దోచుకున్న సొమ్మును అప్పుడప్పుడు తిరిగి ఇచ్చేస్తుంటారు. అలాంటి ఓ దొంగ.. తొమ్మిదేండ్ల క్రితం దోచుకున్న విలువైన ఆభరణాలను తిరిగి ఇచ్చేశాడు. అంతే కాదు.. నేరానికి పాల్పడినందుకు గానూ తనకు తాను జరిమానా విధించుకుని, దాన్ని కూడా చెల్లించాడు. ఆ నిజాయితీ దొంగ గురించి తెలుసుకోవాలంటే ఒడిశా రాష్ట్రానికి వెళ్లక తప్పదు.
దొంగ మాటల్లోనే.. ఒడిశాలోని గోపినాథ్పూర్లోని ఓ ఆలయంలోకి తొమ్మిదేండ్ల క్రితం వెళ్లాను. ఆ ఆలయంలో యజ్ఞం చేస్తుండగా, ఖరీదైన ఆభరణాలను అపహరించాను. ఆ ఆభరణాలను దొంగిలించినప్పటి నుంచి నా జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాను.. ఎదుర్కొంటూనే ఉన్నాను. దీంతో నేను దొంగిలించిన ఆభరణాలను ఆ దేవుడి పాదాల చెంతకు చేర్చాలని నిర్ణయించుకున్నాను. ఇక సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకుని ఖరీదైన ఆభరణాలను ఆలయంలో ఉంచినట్లు దొంగ ఓ నోట్లో పేర్కొన్నాడు.
దొంగిలించిన ఆభరణాలతో పాటు ఆ దొంగ.. కొంత డబ్బును ఆలయానికి విరాళంగా కూడా ఇచ్చాడు. ఆభరణాల బ్యాగులో రూ. 301 ఉంచాడు. అందులో రూ. 201 విరాళం కాగా, నేరానికి పాల్పడినందుకు తనకు తాను విధించుకున్న శిక్షలో భాగంగా రూ. 100 జరిమానా కింద చెల్లించినట్లు దొంగ తెలిపాడు. అయితే ఈ నోట్లో అతని పేరు, ఊరు వివరాలు ఎలాంటివి తెలియపరచలేదు.
దొంగ అపహరించిన ఆభరణాల ఖరీదు రూ. 4 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. చెవి కమ్మలు, బంగారు గొలుసు, కిరీటం ఉన్నాయి. కృష్ణా, రాధ విగ్రహాలకు చెందిన ఆభరణాలు మళ్లీ తిరిగి దొంగ ఇచ్చేయడం అద్భుతం అని ఆలయ పూజారి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.