న్యూఢిల్లీ: భారత్‌లో దౌత్యపరమైన కార్యకలాపాలను ఇక నిలిపివేస్తున్నామని అఫ్ఘానిస్థాన్ (Afghanistan) రాయబార కార్యాలయం (Embassy) ప్రకటించింది. భారత ప్రభుత్వం నుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు (Lack of suppor) లభించకపోవడంతో న్యూఢిల్లీలోని (New Delhi) తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్ 1) నుంచి మూసివేయనున్నామని తాలిబన్ (Taliban) ప్రభుత్వం తెలిపింది. దీనిపట్ల తాము చింతిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలను, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అన్నివిధాలుగా ఆలోచించిన తర్వాతే తమ దౌత్యపరమైన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించామని వెల్లడించింది.
తమ దేశంపట్ల భారత్ ఆసక్తిని చూపడం లేదని, రాయబార కార్యాలయంలో సిబ్బంది, వనరులను (Resources) తగ్గించిందని తెలిపింది. దీంతో కార్యకలాపాలను కొనసాగించండంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరో మార్గం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అధికారాన్ని భారత్‌కు అప్పగించే వరకు అఫ్ఘాన్ పౌరులకు అత్యవసర కౌన్సిలర్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ (1961)లోని ఆర్టికల్ 45 ప్రకారం రాయబార కార్యాలయం ఆస్తి, సౌకర్యాలు ఆతిథ్య దేశ సంరక్షక అధికారానికి బదిలీ చేస్తారు.
కాగా, భారత్‌లో ప్రస్తుతం ఆ దేశ రాయబారిగా (Ambassador) ఫరీద్ మముంద్‌జాయ్ (Farid Mamundzay) వ్యవహరిస్తున్నారు. తాలిబన్లు అఫ్ఘానిస్థాన్‌ను ఆక్రమించకముందు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) ప్రభుత్వం ఆయనను నియమించింది. 2021, ఆగస్టులో అఫ్ఘాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లిన విషయం తెలిసిందే.