(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ(ఏఐ)ది కీలక స్థానం. ఏఐ ప్రవేశంతో ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఏఐతో ఉద్యోగాల కోత ఉందన్న విషయాన్ని పక్కనబెడితే, దాని ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలు చాలా ఎక్కువే. ఏఐ రంగంలో ఇప్పటికే చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినీ, డీప్‌సీక్ వంటి ప్లాట్‌ఫామ్‌లు మంచి ఆదరణను చూరగొన్నాయి. అయితే, వీటిని తలదన్నే ఫీచర్లతో ఏఐకి అడ్వాన్స్డ్ వెర్షన్‌గా ‘ఏజెంటిక్ ఏఐ’ వచ్చింది. మానవ ప్రమేయం అత్యంత తక్కువగా వినియోగించుకొనే ఈ అడ్వాన్స్డ్ ఏఐ.. సొంతంగా నిర్ణయాలను వెలువరించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
‘ఏజెంటిక్ ఏఐ’ అనే పేరు ‘ఏజెన్సీ’ నుంచి వచ్చింది. ఏజెన్సీలు ఎలాగైతే అప్పగించిన పనులను స్వతంత్రంగా, నిక్కచ్చిగా పూర్తిచేస్తాయో ఈ ఏఐ కూడా అలాగే నిర్వర్తిస్తుంది. మానవ ప్రమేయం అత్యంత తక్కువగా తీసుకొనే ఈ ఏఐ చక్కబెట్టే పనులు 99 శాతం పర్ఫెక్షన్తో ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.
మనం ఏదైనా అంశంపై ప్రశ్న అడిగితే, నెట్‌లోని పలు వెబ్సైట్లు, లార్జ్ లాంగ్వేజ్ మాడల్స్ (ఎల్ఎల్ఎం) వంటి డాటాబేస్‌లను ఆధారంగా చేసుకొని సాధారణ ఏఐలు సమాధానాలు ఇస్తాయి. అయితే, ఏజెంటిక్ ఏఐ మాత్రం దీనికి భిన్నంగా పనిచేస్తుంది. ఉదాహరణకు.. ఒక హాస్పిటల్ ఓపీలో 50 మంది రోగులు ఉన్నారని అనుకొంటే? వారి రికార్డులను ఏజెంటిక్ ఏఐలో అప్లోడ్ చేసి.. వ్యాధి తీవ్రతను బట్టి రోగులను పంపించాలని ఆదేశాలు ఇస్తే.. ఆ రికార్డులన్నింటినీ అది క్షుణ్ణంగా విశ్లేషిస్తుంది. ఆ తర్వాత వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను పంపించడమే కాదు.. వారి ట్రీట్మెంట్కు అవసరమైన ఔషధాలను, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఏజెంటిక్ ఏఐ వివరిస్తుంది. అంటే ఒకరకంగా ఇది ఓ ఫ్రెండ్లీ ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది. మరో ఉదాహరణగా చెప్పాలంటే.. మీ ఫోన్లో ఉదయం 6 గంటలకు నిద్రలేచేందుకు అలారం పెట్టుకొన్నారు. 7 గంటలకు ఆలయంలో జరిగే పూజకు అటెండ్ అవ్వాలని నెల కిందటే రిమైండర్ సెట్ చేసుకొన్నారు. మీ ఇంటి ఈఎంఐ పేమెంట్ సైకిల్ డేట్ అదే రోజు ఉంది. ఆఫీసులో సాయంత్రం కొలిగ్స్‌తో డిన్నర్ ఫిక్స్ అయ్యింది. ఇవన్నీ మనకు రిమైండర్‌గా తెలియాలంటే వేర్వేరు యాప్స్ అవసరం. అయితే, ఒకసారి ఏజెంటిక్ ఏఐకి డైలీ షెడ్యూల్ అంటూ కమాండ్ ఇచ్చారంటే, ఆ రోజు షెడ్యూల్‌ను ముందుగానే ఓ లిస్ట్‌గా తయారుచేసి ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేస్తుంది. అలాగే, అంతకుముందు రోజు, ఈ రోజు మీరు ఏ ప్రోగ్రామ్‌కు ఎక్కువ సమయం వెచ్చించారు? దీంతో ఏం ప్రయోజనం చేకూరింది? ఇలా అన్ని విషయాలను స్వతంత్రంగా విశ్లేషించి మీకు రిపోర్ట్ అందిస్తుంది. అంటే ఒక విధంగా మీకు డిజిటల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తుంది.
ఏజెంటిక్ ఏఐ సర్వీసులను ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తదితర రంగాల్లో ఇప్పటికే విరివిగా వినియోగిస్తున్నారు. డ్రైవర్ రహిత కార్లు, స్మార్ట్ హోమ్స్, పర్సనల్ అసిస్టెంట్స్లోనూ ఈ ఏఐ సేవలనే కీలకంగా వాడుతున్నారు.