Adulterated Ghee : పేద, మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్‌లో కల్తీ నెయ్యి అమ్మకాలు జరుగుతున్నాయి. నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చిన వచ్చిన ఓ వినియోగదారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ డిమార్ట్ స్టోర్‌లో కల్తీ నెయ్యి పట్టుబడింది. కస్టమర్ ఫిర్యాదు మేరకు రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు.. 450 లీటర్ల ప్రోవేదిక్ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.
జైపూర్‌లోని అన్ని డిమార్ట్ స్టోర్లలో, గోదాములలో నిలువ ఉంచిన ప్రోవేదిక్ నెయ్యి, సరస్ నెయ్యి వివరాలను తెలియజేయాలని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాటిని విక్రయించవద్దని డిమార్ట్ సేల్స్ మేనేజర్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశించారు. మాలవీయ నగర్‌లోని సూపర్ మార్కెట్లో నిలువ ఉంచిన సుమారు 450 లీటర్ల నెయ్యి కల్తీ అని ప్రాథమిక విచారణలో తేలింది.
సరస్ నెయ్యి నాణ్యత కంట్రోల్ మేనేజర్, అనలిస్ట్ నుంచి కల్తీ నాణ్యతను నిర్ధారించిన అధికారులు సుమారు 40 లీటర్ల నకిలీ సరస్ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెయ్యిలో ఒకే బ్యాచ్ నెంబర్, సిరీస్ ఉన్నట్లు గుర్తించారు. విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నకిలీ సరస్ నెయ్యి ప్యాకెట్స్ లభించాయి.