పట్నా: ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి కాదని, దానికి బదులుగా 11 రకాల ఇతర గుర్తింపు పత్రాలలో ఓ ఒక్కటి చూపించినా సరిపోతుందని ఎన్నికల సంఘం చెప్తున్నది. అయితే, ఈసీ చెప్పినంత సులభంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవని బీహార్‌లోని తాజా నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, నిరక్షరాస్యులు ఈ 11 పత్రాలలో ఒక్క దాన్ని సంపాదించడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విధానపరంగా ఓటరుకు మేలు చేసే ఈ నిబంధన ఆచరణలో మాత్రం వారికి అడ్డంకిగా మారుతున్నది. చాలామందికి ఉన్న ఏకైక గుర్తింపు పత్రం ఆధార్‌కార్డు. కానీ, అందులో పేరు, చిరునామా పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు ఉంటున్నాయి. వాటిని సరి చేయించుకోవడం పెద్ద ప్రహసనంగా మారింది.
ఎంఎన్ఆర్ఈజే జాబ్ కార్డుల విషయానికొస్తే అవి ఎక్కువగా కూలీల వద్ద కాకుండా వారి యజమానులు లేదంటే గ్రామ పెద్దల వద్దనే ఉంటున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో ఆ కార్డును పొందడం వారికి సాధ్యపడటం లేదు. బ్యాంకు, పోస్టాఫీసు పాస్‌బుక్కులను ఈసీ అనుమతిస్తున్నప్పటికీ చాలామంది పేదలకు బ్యాంకు ఖాతాలు ఉండవు. ఉన్నా పాస్‌బుక్‌లపై వారి ఫొటోలు ఉండకపోవడం, లేదంటే అప్డేట్ కాకపోవడం మరో సమస్య.