Yogi Cabinet | ఉత్తరప్రదేశ్ చరిత్రలో 37 ఏండ్ల తర్వాత ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని.. రెండోసారి రాష్ట్ర సీఎంగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణం చేశారు. ఆయనతోపాటు 52 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. యోగి క్యాబినెట్లో రాజకీయ నాయకుడిగా మారిన మాజీ ఐఏఎస్ కూడా ఉన్నారు. రాజకీయ వర్గాల్లో మోదీ మ్యాన్ అని చెబుతుంటారు. ఆయనే అరవింద్ కుమార్ శర్మ. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో పని చేసిన ఏకే శర్మకు 18 ఏండ్లుగా ప్రధాని నరేంద్రమోదీతో అనుబంధం ఉంది. తొలిసారి క్యాబినెట్లో ఉన్న వారిలో 24 మందిని యోగి తప్పించారు. ఇక సురేశ్ ఖన్నా, సూర్య ప్రతాప్ సాహి, స్వతంత్రదేవ్ సింగ్, బేబి రాణి మౌర్య వంటి లీడర్లను యోగి ఆదిత్యనాథ్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు.
జాతవ సామాజిక వర్గానికి చెందిన బేబి రాణి మౌర్య ఇంతకుముందు ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పని చేశారు. 1995లో ఆగ్రా నగరానికి మేయర్‌గా పని చేసిన తొలి మహిళ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదకు క్యాబినెట్ హోదా దక్కింది. బీజేపీ మిత్ర పక్షాలైన అప్నా దళ్ (సోనేలాల్) సభ్యుడు అశీష్ పటేల్, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్లను క్యాబినెట్లోకి తీసుకున్నారు.
ముస్లింల నుంచి దానిష్ ఆజాద్ అన్సారీ మంత్రిగా ప్రమాణం చేశారు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఏకైక ముస్లిం మంత్రి దానిష్ అజాద్ మాత్రమే. ఇక రాజకీయ వేత్తగా మారిన మాజీ ఐపీఎస్ అధికారి అసీం అరుణ్‌తోపాటు దయాశంకర్ సింగ్, నితిన్ అగర్వాల్, కల్యాణ్ సింగ్ మనుమడు సందీప్ సింగ్ సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)గా ప్రమాణం చేశారు.
లక్నోలోని అటల్ బీహారీ వాజపేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో సీఎంగా యోగి ఆదిత్యనాథ్తోనూ, ఆయన క్యాబినెట్ మంత్రులతో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఇక యోగి మంత్రి వర్గంలో కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌లు డిప్యూటీ సీఎంలుగా ఉంటారు. తొలి క్యాబినెట్లో కీలక మంత్రులుగా ఉన్న సతీశ్ మహానా, శ్రీకాంత్ శర్మ, దినేశ్ శర్మ, సిద్ధార్థ్ నాథ్ సింగ్ సహా 24 మందిని తప్పించారు.