Adhir Ranjan Chowdhury : కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి ఘటనపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. ఈ కేసులో దర్యాప్తు సజావుగా సాగాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరుకోవడం లేదని ఆరోపించారు. అధిర్ రంజన్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేసు దర్యాప్తు సవ్యంగా సాగితే ఎన్నో రహస్యాలు వెలుగుచూస్తాయని, ఇలా జరగడం దీదీకి ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే కోల్కతా ఘటన నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకు, ప్రజల్ని భయపెట్టేలా ఆమె నానా చెత్తా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
కానీ ప్రజలు భయపడరని, కోల్కతా ఘటన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందని ఆయన పేర్కొన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అరాచకం సృష్టిస్తోందని బిహార్లో విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటనపై తేజస్వి గురువారం స్పందించారు. మార్కెట్లలో దుకాణాలను కాషాయ శ్రేణులు లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయాలని బీజేపీ కోరుకుంటున్నదని మండిపడ్డారు. వారు ప్రజలను నిరంరం రెచ్చగొడుతూ అలజడులకు ప్రేరేపిస్తున్నారని దుయ్యబట్టారు.
కాషాయ పాలకుల ఉచ్చులో బెంగాల్ ప్రజలు చిక్కుకోరని తాము భావిస్తున్నానమని అన్నారు. ఇక లైంగిక దాడుల విషయానికి వస్తే యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధికంగా వెలుగుచూస్తున్నాయని చెప్పారు. బిహార్లోనూ లైంగిక దాడుల ఘటనలు తరచూ చోటుచేసుకుంటాయని తెలిపారు. వీటిపై వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని తేజస్వి యాదవ్ నిలదీశారు. బీజేపీ ప్రతిచోటా భయానక వాతావరణం సృష్టించాలని కోరుకున్నా అలా చేయడంలో ఆ పార్టీ ఎప్పుడూ ఫలప్రదం కాలేదని అన్నారు.
Read More :