కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పదవికి అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) రాజీనామా చేశారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలను సమీక్షించారు. ఈ సమావేశం తర్వాత బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అధిర్ రంజన్ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం ఆమోదించిందా లేదా అన్నది స్పష్టం కాలేదు.
కాగా, బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తన రాజీనామాను అధిర్ రంజన్ చౌదరి ధృవీకరించారు. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైనప్పటి నుంచి రాష్ట్రానికి అధ్యక్షుడు లేరని తెలిపారు. ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమిస్తారని, మీ అందరికీ తెలుస్తుందని ఎక్స్‌లో పేర్కొన్నారు.
మరోవైపు ముర్షిదాబాద్‌లోని బహరంపూర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన అధిర్ రంజన్ చౌదరి ఈసారి పరాజయం చెందారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఆయన ఓడిపోయారు.