న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో పశ్చిమాసియా యుద్ధంపై ఓ ప్రకటన చేసిన ప్రధాని.. యుద్ధం కారణంగా భారత్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పారు. అయితే ప్రస్తుతం దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ఆయన ప్రకటించారు. హొర్ముజ్ నుంచి వచ్చే చమురు నౌకలను సురక్షితంగా మన రేవులకు చేరేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మోదీ తెలిపారు. యుద్ధం వల్ల సంభవించే దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కొనడానికి ఏడు సాధికారత బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సంక్షోభాన్ని నివారించడానికి టీమ్ ఇండియా స్ఫూర్తితో కేంద్రంతో కలసి పనిచేయాలని రాష్ర్టాలను కోరారు.
పశ్చిమాసియాలో పరిస్థితి ఎప్పటికప్పుడు మారిపోతున్నదని, దాని దుష్ప్రభావాలు దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిస్తూ యుద్ధం వల్ల సంభవించే దుష్ప్రభావాలను వివరించారు. కొవిడ్ మహమ్మారి సందర్భంగా ఆనాడు తలెత్తిన సవాళ్లను ఎదుర్కొనడానికి నిపుణులతో కూడిన సాధికార బృందాలు చేసిన కృషిని ఆయన గుర్తు చేస్తూ ఈ యుద్ధం వల్ల సంభవించే పర్యవసనాలను ఎదుర్కొనడానికి ఏడు సాధికారత బృందాలు ఇంధనం, ఎరువులు, గ్యాస్, సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణంపై వ్యూహాలను రచిస్తాయని చెప్పారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు చర్చలు, దౌత్యమే ఏకైక పరిష్కారాలన్న భారత్ వైఖరిని ప్రధాని పునరుద్ఘాటించారు.