హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ)/ న్యూఢిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై విచారణకు జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఇతర విపక్ష పార్టీల ఎంపీలు మంగళవారం పార్లమెంట్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్లమెంట్ భవనంలోని మొదటి అంతస్థులో ఆందోళన చేపట్టారు. ‘వియ్ వాంట్ జేపీసీ’ అంటూ ఒక పెద్ద బ్యానర్‌ను పార్లమెంట్ భవనంపై ప్రదర్శించారు. మోదీ-అదానీ బంధంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసూ ్త‘ఇన్వెస్టిగేట్ మోదానీ’ అని రాసివున్న ప్లకార్డును ఎంపీలు ప్రదర్శించారు.
‘ఈడీ-మోదానీ భాయ్ భాయ్, మోదానీని కాపాడటం ఆపండి-అదానీపై విచారణ చేయండి’ అనే ప్లకార్డులు చేతబట్టి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. మోదీ దిగొచ్చి సమాధానం చెప్పే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందేనని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి.
Mps
ప్రజలకు సమాధానం చెప్పాలి: నామా
అదానీ అంశంపై ఇప్పటికైనా ప్రధాని మోదీ మౌనం వీడాలని, దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి, పార్లమెంట్లో చర్చకు అనుమతించాలన్నారు. అదానీ వ్యవహారంపై దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని, కేంద్రం నోరు మెదపకపోవడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్‌ను వాయిదా వేసుకుంటూపోతూ అదానీ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని నామా హెచ్చరించారు.
అదానీని అరెస్ట్ చేయాలి
కార్పొరేట్ అదానీని కేంద్ర ప్రభుత్వం కాపాడుతున్నదని టీఎంసీ ఆరోపించింది. అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ టీఎంసీ ఎంపీలు విజయ్‌చౌక్ వద్ద ఆందోళన చేశారు. ప్రధాని మోదీ, అదానీ మధ్య ఒక అవగాహన ఉన్నదని, బీజేపీతో అదానీకి ఉన్న పార్ట్నర్షిప్ వల్లే కేంద్రం ఆయన్ను కాపాడుతున్నదని టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు.