న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతం అదానీ వెనక్కి తగ్గారు. శ్రీలంకలో చేపట్టాల్సిన రెండు పవన విద్యుత్తు ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ(Adani Green Energy) కంపెనీ ఈ ప్రకటన చేసింది. శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అదానీ కంపెనీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని కొత్త అధ్యక్షుడు దిసనాయకే భావిస్తున్నారు. దీంతో పవర్ ప్రాజెక్టులపై నూతన సర్కారు కొత్త నిర్ణయం తీసుకోనున్నది. అయితే పవర్ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్నట్లు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అదానీ గ్రీన్ ఎనర్జీ శ్రీలంకకు తెలియజేసింది.
శ్రీలంకలో రెండు పవన విద్యుత్తు ఉత్పత్తి కోసం సుమారు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని అదానీ కంపెనీ భావించింది. కానీ శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే తీసుకున్న నిర్ణయంతో వెనక్కి తగ్గినట్లు కంపెనీ పేర్కొన్నది. అయితే భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు శ్రీలంకతో కలిసి పనిచేయనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది.
అదానీ గ్రూపు మాత్రం కొలంబోలో నిర్మించబోయే పోర్టు టర్మినల్ కోసం 700 మిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నది. వాస్తవానికి పవన విద్యుత్త ప్రాజెక్టు కోసం గత లంక ప్రభుత్వం అదానీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ నేపథ్యంలో లంక ప్రభుత్వానికి విద్యుత్తు అమ్మేందుకు రెండు ప్రాజెక్టులు చేపట్టాలని అదానీ ఎనర్జీ భావించింది. కానీ కొత్త సర్కారు విద్యుత్తు ఛార్జీలపై పునరాలోచనలో పడింది. దీంతో ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్నట్లు అదానీ ఎనర్జీ తెలిపింది.