Parliament Session | న్యూఢిల్లీ, నవంబర్ 28: భారత పారిశ్రామికవేత్త అదానీ అవినీతి అంశం, యూపీలోని సంభల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై విపక్షాలు నిలదీస్తూ నిరసనలు వ్యక్తం చేయడంలో గురువారం పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించిపోయాయి. దీంతో లోక్సభ, రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. సంభల్లో మసీదు సర్వే సందర్భంగా హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు సభాపతి స్థానం వద్దకు వచ్చి నినాదాలు చేశారు.
సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాల చర్యలను పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. కొన్ని అంశాలపై సభలో చర్చించడానికి, వక్ఫ్ సవరణ బిల్లుపై వేసిన జాయింట్ కమిటీ గడువును పొడిగించడానికి తాము అంగీకరించినా విపక్షాలు నిరసనలు తెలుపుతున్నాయని ఆయన ఆరోపించారు. విపక్షాలు తమ నిరసనలు కొనసాగించడంతో సభాపతి స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ కృష్ణప్రసాద్ సభను వాయిదా వేశారు. అంతకుముందు వక్ఫ్ సవరణ బిల్లుపై వేసిన జాయింట్ కమిటీని వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశం వరకు పొడిగిస్తూ లోక్సభలో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రశ్నోత్తరాల సమయం కూడా విపక్ష సభ్యుల గందరగోళం మధ్య కొనసాగింది.
కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గురువారం లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె సోదరుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర నేతలు వెంట రాగా తొలిసారిగా సభలో అడుగుపెట్టారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. నాందేడ్ ఎంపీగా నెగ్గిన కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావ్ చవాన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నికవ్వడంతో ఒక తల్లి, ఆమె ఇద్దరు బిడ్డలు ఒకేసారి ఎంపీలుగా ఉన్న అరుదైన ఘటన పార్లమెంట్లో చోటు చేసుకుంది.
గత 11 నెలల కాలంలో జిల్లా, సబార్డినేట్ న్యాయస్థానాల్లో 9 లక్షలకు పైగా పెండింగ్ కేసులు ఉన్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలె గురువారం రాజ్యసభలో తెలిపారు. అలాగే ఈ ఏడాది జనవరి 1 నాటికి మొత్తం 4.44 కోట్ల కేసులు ఉన్నాయని, నవంబర్ 15తో కలుపుకుని మొత్తం 4.53 కోట్ల కేసులున్నట్టు మంత్రి వివరించారు. సబార్డినేట్, జిల్లా కోర్టుల్లో 5 వేలకు పైగా జడ్జీ పోస్టులు, దేశంలోని 25 హైకోర్టుల్లో మొత్తం 360 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక సుప్రీం కోర్టులో మొత్తం 34 జడ్జీలకు ప్రస్తుతం 32 మంది ఉన్నారని ఆయన తెలిపారు.
గత ఐదేండ్ల కాలంలో 1.12 కోట్ల ప్రజా ఫిర్యాదులను పరిష్కరించినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీజీపోర్టల్.జీవోవీ.ఇన్లో 2020-2024 సంవత్సరాల మధ్య 1,12,30,957 ఫిర్యాదులను పరిష్కరించామని, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు రికార్డు స్థాయిలో అధికంగా 23,24,323 పరిష్కరించినట్టు వివరించారు.
అంగన్వాడీల్లో నమోదైన ఐదేండ్ల లోపు వయసు గల బాలలు ఎదుగుదల సమస్యను ఎదుర్కొంటున్నారు. కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా అంగన్వాడీల్లో 7.54 కోట్ల మంది ఐదేళ్ల లోపు వయసుగల బాలలు ఉన్నారు. వీరిలో 38.9 శాతం మంది వయసుకు తగిన ఎత్తు ఎదగలేదు. 17 శాతం మంది తక్కువ బరువు, 5.2 శాతం మంది ఎత్తుకు తగిన బరువు లేరు. పోషకాహార లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.