Actress Kasturi : తెలుగు వారిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన తమిళ నటి కస్తూరి పరారీలో ఉన్నారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఇంటికి తాళం వేసింది. దాంతో ఈ కేసులో కస్తూరికి సమన్లు ఇవ్వడం పోలీసులకు కష్టంగా మారింది. కొద్ది రోజుల క్రితం నటి కస్తూరి తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ రాజకీయ సభలో ఆమె తెలుగు వారిని కించపరుస్తూ మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు మండిపడ్డాయి.
దాంతో ఆమె తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాను తెలుగు వారిని కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మూడు రోజుల క్రితం కస్తూరిపై చెన్నైలో ఇదే విషయమై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆమెకు సమన్లు అందజేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఫోన్ చేశారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది.
దాంతో నటి కస్తూరి పారిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఎక్కడుందనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కస్తూరి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. ఓ తెలుగు సీరియల్లోనూ లీడ్ రోల్ పోషించి మంచి గుర్తింపు పొందారు. అందుకే తెలుగులో అవకాశాలు పొందుతూ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల నటి కస్తూరీ ఓ రాజకీయ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె.. ‘తమిళనాడులో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగువారు వచ్చేవారు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.