బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 17:13:19

ఆర్పీఐలో చేరిన బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌

ఆర్పీఐలో చేరిన బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌

ముంబై: బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) లో చేరారు. ఆమెకు పార్టీ జెండా అందజేసి కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ అధినేత రామ్‌దాస్ అథవాలే స్వాగతం పలికారు. సోమవారం ముంబైలోని ఆర్‌పీఐ కేంద్ర కార్యాలయంలో పాయల్‌ ఘోట్‌ అథవాలేతో కలిసి పనిచేయడానికి సిద్ధమై పార్టీలో చేరారు. అనంతరం ఆమెను ఆర్‌పీఐ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించారు.

బాలీవుడ్ చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు చేసిన ఈ నటి ఇటీవల వార్తల్లో నిలిచారు. ఈ ఆరోపణలను చిత్ర నిర్మాత ఖండించారు. ఈ కేసుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఘోష్ సెప్టెంబర్ 29 న మహారాష్ట్ర గవర్నర్ బి.ఎస్. కోష్యారిని కలిశారు. ఈ సమయంలో రామ్‌దాస్‌ అథవాలే ఆమె వెంట ఉన్నారు. అనంతరం వీరిద్దరు కలిసి ముంబై పోలీస్ జాయింట్ కమిషనర్ వీఎన్ పాటిల్‌తో భేటీ అయ్యారు. 376, 354, 341, 342 సెక్షన్లతోపాటు వివిధ విభాగాల కింద చిత్ర నిర్మాతపై పాయల్‌ ఘోష్ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. 

“ఆర్పీఐ (ఏ) పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ అని ఆమెకు నేను చెప్పాను. ఇది సమాజంలోని అన్ని వర్గాలకు సహాయపడుతుంది. మీరు పార్టీలో చేరితే ఆర్పీఐకి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పాను. నేను ఆమెతో ఈ విషయం చర్చించిన తరువాత, ఆమె పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు ”అని రామ్‌దాస్‌ అథవాలే చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.