Gayathri Raguramm : మళయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల ఘటనలను వెల్లడించిన హేమ కమిటీ నివేదిక దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, అరాచకాలు ఏ స్ధాయిలో జరుగుతాయో ఈ నివేదిక కండ్లకు కట్టింది. హేమ నివేదికపై ఏఐఏడీఎంకే మహిళా విభాగం సహాయ కార్యదర్శి, నటి గాయత్రి రఘురాం స్పందించారు. సినీ పరిశ్రమలో దారుణాలపై కొందరు మహిళలు ధైర్యంగా పోరాడతారని, మరికొందరు ఈ క్రమంలో అవకాశాలు కోల్పోతారని ఆమె వ్యాఖ్యానించారు.
మహిళల రిజర్వేషన్లను తీసుకురావాల్సిన సమయం ఇదేనని అన్నారు. గతంలో మనకు మహిళా సీఎంలు ఉండేవారని కానీ ఇవాళ కేవలం మమతా బెనర్జీ ఒక్కరే సీఎం స్ధాయిలో ఉన్నారని చెప్పారు. మహిళలను కాపాడే సమర్ధ మహిళా నాయకత్వం ఈరోజు కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ కేవలం పలు పవర్ సెంటర్లలో శక్తివంతమైన పురుషులు శాసిస్తున్నారని చెప్పారు. చాలాకాలంగా ప్రజ్వల్ రేవణ్ణ ఎలా తప్పించుకుతిరుగుతున్నారో చూస్తున్నామని గుర్తుచేశారు.
బిల్కీస్ బానోపై లైంగిక దాడి నిందితులు ఎలా బయటపడ్డారో చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తమిళనాడు సినీ పరిశ్రమ మొత్తం డీఎంకే గుప్పిట్లో ఉందని, ఈ పరిస్ధితుల్లో ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం చాలా కష్టమని చెప్పారు. కమిటీలు ఒక్కటే ఏమీ చేయలేవని, మహిళలపై లైంగిక వేధింపుల అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.
Read More :
WhatsApp | వాట్సాప్ కాల్ అదుర్స్.. వీడియో కాల్స్‌లో ఏఆర్ ఎఫెక్ట్లు!