WhatsApp | దోస్తులతో, కుటుంబసభ్యులతో వీడియో కాల్స్ మాత్రమే కాదు.. ఆఫీస్ గ్రూప్ మీటింగ్లూ వాట్సాప్‌తోనే కానిచ్చేస్తున్నాం. రెగ్యులర్ వీడియో కాల్ చేసింది చాలు.. ఇక మీదట కాస్త వెరైటీగా ప్రయత్నించండి. ఇందుకోసం వాట్సాప్ వీడియో కాల్స్‌లో ‘ఏఆర్’ ఎఫెక్ట్లు తీసుకురానుంది. అగ్మెంటెడ్ రియాలిటీతో మీ వీడియో చాటింగ్ మరింత ఆకట్టుకునేలా మారనుంది. అదెలా అంటే.. మీ లుక్‌ని రియల్‌టైమ్‌లోనే మార్చేయొచ్చన్నమాట! అందుకు ‘ఫేషియల్ ఫిల్టర్స్’ ఆప్షన్స్ ఉంటాయి. వీడియో కాల్కి ముందు వాటిని అప్లయ్ చేయడం ద్వారా మీ స్కిన్ ‘కలర్ టోన్’ మార్చేయొచ్చు. మీరున్న లొకేషన్, చుట్టూ ఉన్న లైటింగ్‌కు తగినట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌లో మార్పులు చేర్పులు చేయొచ్చు. ‘బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ టూల్’తో మీ వెనకున్న సీన్ మొత్తాన్నీ మార్చేయొచ్చు!
ఉదాహరణకు ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ మీటింగ్ కాల్ వచ్చిందే అనుకోండి! అప్పుడు ఆఫీస్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్‌కు సరదాగా కాల్ చేసినప్పుడు.. బీచ్‌లో ఉన్నట్టు బ్యాక్‌గ్రౌండ్‌ను పెట్టుకునే వీలుంది. వీటిని ‘ప్రీసెట్ బ్యాక్గ్రౌండ్స్’గా పిలుస్తున్నారు. అవన్నీ ఎందుకులే అనుకుంటే.. ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేసేయొచ్చు. తక్కువ వెలుతురు ఉన్నట్టయితే.. ‘లోలైట్ మోడ్’ని సెలెక్ట్ చేసుకొని లైటింగ్ అడ్జెస్ట్ చేసుకునే వీలుంది. చివరిగా కాస్త మేకప్ టచ్ అప్ ఇద్దాం అనుకున్నప్పుడు.. ‘టచ్ అప్ మోడ్’ ఎంచుకుంటే సరి! ఇక వాట్సాప్ కాల్లో మీ అందం రెట్టింపవడం ఖాయం. ఇవన్నీ ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు! ‘ప్రీవియస్ సెట్టింగ్స్’ని వాట్సాప్ గుర్తుపెట్టుకుంటుంది. వీడియో కాల్ రాగానే.. ఆటోమేటిక్‌గా సెట్టింగ్స్ సెట్ అయిపోతాయి. యాపిల్ యూజర్లకు ఈ ఫీచర్ బీటా వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది.