Covid-19 Cases | భారత్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. అత్యధికంగా కేరళలో 1,336 కేసులు ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో నిలిచాయని చెప్పింది. గత 24 గంటల్లో దేశంలో నాలుగు మరణాలు నమోదయ్యాయని.. ఢిల్లీ, కేరళ, కర్నాటక, యూపీల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు తెలిపింది. భారతదేశంలో కొవిడ్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇన్ఫెక్షన్ల తీవ్రత తక్కువగా ఉందని పేర్కొన్నాయి. ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు చెప్పాయి. మే 22న దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉండగా.. మే 26 నాటికి 1,010కి పెరిగాయి. శనివారం నాటికి 3,395కి చేరినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 685 కొత్త కేసులు నమోదయ్యాయి.
నలుగురు ప్రాణాలు కోల్పోయారని మంత్రిత్వశాఖ డేటా పేర్కొంది. కేరళలో 1,336 యాక్టివ్ కేసులు, మహారాష్ట్ర 467, ఢిల్లీలో 375, గుజరాత్ 265, కర్ణాటక 234, పశ్చిమ బెంగాల్ 205, తమిళనాడు 185, ఉత్తరప్రదేశ్ 117 కేసులు ఉన్నట్లు వివరించింది. పశ్చిమ-దక్షిణ ప్రాంతాల్లోని నమూనాల జన్యు శ్రేణిని పరిశీలించినప్పుడు, ప్రస్తుత కేసుల పెరుగుదలకు కారణమైన వైవిధ్యాలు తీవ్రమైనవేవి కావని.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అని తేలిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెహ్ల్ పేర్కొన్నారు. ఓమిక్రాన్ నాలుగు ఉప వేరియంట్లు ఎల్ఎఫ్.7, ఎక్స్ఎఫ్జీ, జేఎన్.1, ఎన్బీ.1.8.1 గుర్తించారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని.. ఈ సమయంలో అన్నింటినీ పర్యవేక్షించాలని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆందోళన చెందేందుకు ఎలాంటి కారణం లేదరని డాక్టర్ బెహ్ల్ పేర్కొన్నారు.