Actor Darshan | అభిమాని రేణుక స్వామి (Renukaswamy) హత్య కేసులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప (Actor Darshan) ప్రవర్తన అధికారులకు తలనొప్పిగా మారింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు (Parappana Agrahara Prison) విచారణ ఖైదీగా ఉన్న నటుడికి రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఇటీవలే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడిని గురువారం బళ్లారిలోని జైలుకు (Ballari jail) అధికారులు తరలించారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు.
బళ్లారి జైలులోకి ప్రవేశిస్తున్నప్పుడు దర్శన్ బ్లూ జీన్స్, బ్లాక్ టీషర్ట్ ధరించారు. టీషర్ట్‌కు సన్‌గ్లాసెస్ (sunglasses)ను వేలాడదీసి కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో దర్శన్ వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దర్శన్‌కు సన్‌గ్లాసెస్‌ను వినియోగించేందుకు అనుమతించిన పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు.
అయితే, ఈ ఘటనపై పోలీసు అధికారులు మరో విధంగా చెబుతున్నారు. దర్శన్ నెక్కు తగిలించుకున్నవి సన్‌గ్లాసెస్ కావని, పవర్ గ్లాసెస్ అని అంటున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న అండర్ ట్రయల్ ఖైదీలు, నిందితులు వాటిని పెట్టుకునేందుకు అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. అది నేరం కాదని వివరణ ఇచ్చారు.
కాగా, అభిమాని రేణుక స్వామి (Renukaswamy) హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరికొందరు నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, జైల్లో విచారణ ఖైదీగా ఉన్న నటుడికి రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఇటీవలే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.
ఇటీవలే దర్శన్ జైలులోని రౌడీషీటర్లతో జల్సాగా టీ తాగుతూ, సిగరెట్ కాల్చుతూ ఆనందంగా గడుపుతున్నట్లు ఓ ఫొటో బయటపడింది. అంతేకాకుండా ఆయన జైలు నుంచి వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఓ వీడియో కూడా వైరల్ అయింది. వీటిపై దర్యాప్తు జరిపిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ జైలు చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించాలని 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు భారీ భద్రత మధ్య గురువారం ఉదయం దర్శన్‌ను పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించారు. మిగతా నిందితులను సైతం కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించినట్లు తెలిసింది.
Also Read..
COURT | నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్