మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 18:24:56

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆచార్య రుత్విక్‌ వ‌ర‌ణం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆచార్య రుత్విక్‌ వ‌ర‌ణం

తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో.. బుధ‌వారం  అంకురార్పణా కార్యక్రమంలో భాగంగా ఉదయం శాస్త్రోక్తంగా ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట రుత్విక్‌వరణం నిర్వహించారు. ఇందులోభాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 

ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరిరోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో వేంచేపు చేస్తారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్యలో భాగంగా శ్రీ‌వారి పవిత్రోత్సవాలు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. కార్యక్రమంలో టీటీడీ ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.
logo