తిరుపతి, ఫిబ్రవరి 26: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణల కేసు దర్యాప్తులో తాజాగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో రసాయనాలు కలిపినట్టు నిందితులలో ఒకరైన కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అపూర్వ చావ్డా సిట్ దర్యాప్తులో వెల్లడించినట్టు తెలిసింది.
నిందితులు అపూర్వ చావ్డా, విపిన్ జైన్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ న్యాయవాది అదనపు మున్సిఫ్ కోర్టులో కస్టడీ పిటిషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, భోలేబాబా ఆర్గానిక్ డైరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్ బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి జయశేఖర్ ధ్రువీకరించారు. నిందితుడు అపూర్వ చావ్డా బెయి ల్, కస్టడీ పిటిషన్‌పై కోర్టు గురువారం విచారణ జరపనున్నది.