చండీగఢ్: ఒక ఇంట్లో ఏసీ కంప్రెసర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, మహిళతో సహా నలుగురు మరణించారు. (AC Compressor Blast) ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బహదూర్గఢ్లోని అద్దె ఇంట్లో ఒక కుటుంబం నివసిస్తున్నది. శనివారం సాయంత్రం ఆ ఇంట్లో ఉన్న ఏసీ కంప్రెసర్ పేలింది. ఈ సంఘటనలో మహిళ, పదేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు, ఒక వ్యక్తి మరణించారు. మరో వ్యక్తికి కాలిన గాయాలయ్యాయి. ఈ పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారు. మరణించిన నలుగురి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని కూడా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీ కంప్రెసర్ పేలడానికి సాంకేతిక లోపమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది దర్యాప్తు చేస్తున్నారు.