కోల్‌కతా: ఆపరేషన్ సింధూర్‌కు దారి తీసిన పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వ నేపథ్యంలోని ఆల్ పార్టీ బృందంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) వెళ్లనున్నారు. ఆ పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఆయన ఉన్నారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫోన్లో మాట్లాడిన తర్వాత అభిషేక్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆల్ పార్టీ బృందం గురించి తమకు అధికారికంగా చెప్పకుండా ఎలా పేర్లను వెల్లడిస్తారని సోమవారం మమతా బెనర్జీ ప్రశ్నించారు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం రిలీజ్ చేసిన జాబితాలో టీఎంసీ తరపున యూసుఫ్ పఠాన్ పేరును రిలీజ్ చేసింది. యూసుఫ్ పఠాన్ పేరును ఎలా మీరు వెల్లడిస్తారని టీఎంసీ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించింది. విదేశాంగ విధానం కేంద్ర ప్రభుత్వానిదని, కానీ ఏ నిర్ణయం తీసుకున్నా, పార్టీకి చెప్పాలని మమతా అభిప్రాయపడ్డారు. పేర్లు వెల్లడించే అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆమె తప్పుపట్టారు. ఉగ్రవాదంపై పోరును కొనసాగించే నేపథ్యంలో ఏడు బృందాలను విదేశాలకు కేంద్రం పంపుతున్న విషయం తెలిసిందే. మమతా బెనర్జీ తన అసహనాన్ని వ్యక్తం చేయడంతో ఆ బృందం జాబితా నుంచి యూసుఫ్ పఠాన్ తప్పుకున్నారు.
ఆల్ పార్టీ మీటింగ్‌లకు ఎవర్ని ప్రతిపాదించాలన్న అంశాన్ని కేంద్రం డిసైడ్ చేయదని మమత అన్నారు.