న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal) ఈ వేదికపై ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ఆసక్తిగా ఆమె మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఒకప్పుడు సన్నిహితురాలిగా ఉన్న స్వాతి మలివాల్ గత కొన్ని నెలలుగా ఆయనను తీవ్రంగా విమర్శించే వారిలో ఒకరిగా ఎదిగారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. యమునా నదిని శుభ్రం చేయడంలో విఫలమైనందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ నివాసం వద్ద నిరసన కూడా చేపట్టారు. గత ఏడాది మే నెలలో కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఢిల్లీలో ఆప్ ఓటమికి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కారణమని స్వాతి మలివాల్ నిందించారు. ‘ఒక వ్యక్తి చాలా అహంకారంగా మారి ప్రజల కోసం పనిచేయడం మానేస్తే, ప్రజలు ఆ వ్యక్తికి గుణపాఠం నేర్పుతారని నేను భావిస్తున్నా. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా అదే జరిగింది’ అని మీడియాతో అన్నారు. అయితే ఆప్‌ను, కేజ్రీవాల్‌ను తీవ్రంగా విమర్శించే స్వాతి మలివాల్ ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలిగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు.
VIDEO | AAP Rajya Sabha MP Swati Maliwal (@SwatiJaiHind) attends Delhi CM oath-taking ceremony at Ramlila Maidan.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/z9kXxTo9GX
— Press Trust of India (@PTI_News) February 20, 2025