Vice Presidential Election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం ప్రకటించారు. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మార్గరెట్ అల్వాకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పార్టీకి చెందిన సభ్యులందరూ ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వాకు ఓటు వేస్తారని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఈ నెల 6న ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అధికార ఎన్డీయే కూటమి జగ్దీప్ ధన్ఖర్ను బరిలోకి దింపగా.. విపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను బరిలో నిలిపాయి. ఇప్పటికే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఎన్డీయే అభ్యర్థి జగ్దీప్ ధన్ఖర్కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్నికలు జరుగుతున్నాయని, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగ్దీప్ ధన్కర్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు యామావతి ట్వీట్ చేశారు.