న్యూఢిల్లీ, మే 14: ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)ని నిందితుల జాబితాలో చేరుస్తామని ఈడీ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ ఈ మేరకు న్యాయస్థానానికి వెల్లడించింది.
ఈ కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని, అందులో ఆప్‌ను నిందితుల జాబితాలో చేరుస్తామని తెలిపింది. ఇదే గనుక జరిగితే, ఈడీ చరిత్రలో తొలిసారిగా ఓ జాతీయ పార్టీ పేరును నిందితుల జాబితాలో ప్రస్తావించినట్టు అవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈడీ, సీబీఐ కేసుల్లో సిసోడియా పెట్టుకొన్న బెయిల్ దరఖాస్తులపై వాదనలు విన్న జస్టిస్ స్వరణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది.
ఏం జరుగుతుంది?
ఆప్‌ను నిందితుల జాబితాలో చేరిస్తే ఆ పార్టీ పలు ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆప్‌నకు చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఈడీ అటాచ్ చేయవచ్చు. పార్టీ ఆఫీస్ బేరర్లు బాధ్యులుగా మారొచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరేందుకు దీన్ని ప్రత్యర్థి పార్టీలు ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది.
బీజేపీ పొలిటికల్ వింగ్‌లా ఈడీ
ఆప్ నిందితుల జాబితాలో చేరుస్తామన్న ఈడీ ప్రకటనపై ఆ పార్టీ స్పందించింది. బీజేపీకి ఈడీ పొలిటికల్ వింగ్‌లా మారిందని విమర్శించింది. ఆప్‌ను అణచివేసే ఉద్దేశంతోనే ఈ కేసును అక్రమంగా బనాయించారని ఆరోపించింది. కేసులో అప్రూవర్లుగా మారిన నిందితులతో బీజేపీకి లింకులున్నాయని పేర్కొన్నది.