న్యూఢిల్లీ: తీవ్రమైన నేరారోపణలతో 30 రోజులకు మించి కస్టడీలో ఉన్న పీఎం, సీఎం, మంత్రులను పదవిలోంచి తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేస్తూ పార్లమెంట్ ముందుకు తెచ్చిన బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన జేపీసీలో చేరడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తిరస్కరించింది. ఈ సంయుక్త పార్లమెంటరీ కమిటీలో తాము భాగస్వాములం కాదల్చుకోలేదని ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మూడు బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని ఆప్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
బీజేపీ, అవినీతి మధ్య సంబంధం లైలా-మజ్నూ, రోమియో-జూలియట్ లాంటిదని అన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న సీఎంలు, మంత్రులను జైలుకు పంపి ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికే కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. ఇది అవినీతిని అంతం చేయడానికి పెట్టిన బిల్లు కాదని, ఎందుకంటే బీజేపీ అవినీతిని, అవినీతిపరులను ప్రేమిస్తుందని ఆయన ఆరోపించారు. అవినీతిని పారదోలడానికే బీజేపీ ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్న భ్రమ ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.