న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల కోసం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా గురువారం విడుదల చేసింది. (AAP first List) బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇటీవల ఆ పార్టీలో చేరిన ఆరుగురు నేతలు ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నారు. బీజేపీ మాజీ నేతలు బ్రహ్మ్సింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగితో పాటు కాంగ్రెస్ మాజీ నాయకులు చౌదరి జుబేర్ అహ్మద్, వీర్ ధింగన్, సుమేష్ షోకీన్లను అభ్యర్థులుగా ఆప్ ప్రకటించింది.
కాగా, ఐదుగురు ఆప్ నేతలు కూడా తొలి జాబితాలో ఉన్నారు. పార్టీకి విధేయులైన రోహ్తాస్ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే సరితా సింగ్, బదర్పూర్ మాజీ ఎమ్మెల్యే రామ్ సింగ్ నేతాజీ, మహారాష్ట్ర, గోవా ఆప్ ఇంచార్జ్, 2020లో విశ్వాస్ నగర్ నుంచి పోటీ చేసిన దీపక్ సింఘ్లా తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్ నిరాకరించింది.