న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొలువైన బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మండిపడింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని ఆరోపించింది. ఆప్ కార్యకర్తలు బుధవారం ఢిల్లీలోని పలు చోట్ల నిరసనలు తెలిపారు. (AAP Protest) హోలీ సందర్భంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న బీజేపీ హామీని గుర్తు చేశారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు, ఫ్లకార్డులతో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఆప్ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలైన అతిషి, బీజేపీతోపాటు ప్రధాని మోదీపై మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన రూ. 2,500 ఆర్ధిక సహాయం, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు వంటి వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ‘బీజేపీ, ప్రధాని మోదీ ఢిల్లీ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. రూ. 2500 హామీ ఎన్నికల తాయిలంగా మారింది. హోలీ సందర్భంగా ఢిల్లీ మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాల్సి ఉంది. హోలీకి ఇంకా రెండు రోజులే ఉంది. ఢిల్లీ మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బీజేపీ, వారి నకిలీ వాగ్దానాలకు వ్యతిరేకంగా మహిళలు ఖాళీ సిలిండర్లతో నిరసన తెలుపుతున్నారు’ అని అన్నారు.