న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షంలో ఉంటామని పైకి చెప్తూనే ప్రత్యర్థి పార్టీ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. పది మంది ఆప్ కౌన్సిలర్లకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ ఇచ్చిందని బాంబు పేల్చింది. ఆప్ కౌన్సిలర్లు రోనాక్షి శర్మ, అరుణ్ నవరియా, జ్యోతిరాణితో కలిసి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు.
బీజేపీ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన పదిమంది కౌన్సిలర్లలో రోనాక్షి, అరుణ్, జ్యోతి కూడా ఉన్నారని సంజయ్‌సింగ్ తెలిపారు. ‘మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, గుజరాత్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టుగానే ఎంసీడీ కౌన్సిలర్లను గొర్రెల్లా కొనేందుకు బీజేపీ దుర్మార్గపు ఆటలు మొదలుపెట్టింది. ప్రజా తీర్పును అవమానించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నిస్తున్నవారిని వెంటనే అరెస్టు చేయాలి.
ఎన్నికల్లో ఓడిపోయినా మేయర్‌గా తమ పార్టీ వ్యక్తే ఉంటాడని బీజేపీ ప్రకటించింది. యోగేంద్ర చందోలియా అనే వ్యక్తి మా కౌన్సిలర్ రోనాక్షి శర్మకు ఫోన్‌చేసి బీజేపీలో చేరితే రూ.10 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్‌కుమార్ గుప్తాతో కూడా మాట్లాడిస్తానని హామీ ఇచ్చాడు. మా కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు రూ.100 కోట్లు సిద్ధం చేసినట్టు ఆదేశ్‌కుమార్ గుప్తా, బీజేపీ వ్యక్తులే చెప్పారు. ఈ రూ.100 కోట్లు కేవలం 10 మంది కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకేనట! ఒక్కో కౌన్సిలర్‌కు రూ.10 కోట్లు ఇవ్వటానికి సిద్ధమని ఆఫర్ ఇచ్చారు’ అని సంజయ్‌సింగ్ ఆరోపించారు.
మా కౌన్సిలర్లనే కొంటున్నారు: బీజేపీ
తమ కౌన్సిలర్లనే ఆప్ కొనేందుకు ప్రయత్నిస్తున్నదని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది. పార్టీ మారేందుకు ఆప్ నేత శిఖా గార్గ్ తనకు లంచం ఇవ్వబోయారని బీజేపీ కౌన్సిలర్ మోనికా పంత్.. అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదుచేశారు.